రక్తశుద్ధికి జామ
జీర్ణ క్రియ, రక్తశుద్ధికి జామ బాగా ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరానికి పోషకాలు అందుతాయి. అతి చౌకగా లభించే అమృత ఫలమిది.
ఫలాలు.. పోషకాహార ఖనులు..
ఏ జాతి పురోగమనానికైనా ఆరోగ్యవంతమైన మానవ వనరులదే కీలకపాత్ర. ప్రకృతి ప్రసాదించిన ఫలాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందనేది నిపుణుల మాట. నోరూరించే పండ్లను చూస్తే ఎవరికి మాత్రం తినాలనిపించదు చెప్పండి. తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లను నిత్యం ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకుంటే చాలా రోగాలను దూరంగాఉంచొచ్చు. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్‌లు, లవణాలు, మూలకాలు, ఖనిజాలు, విటమిన్లు అన్నీ పండ్ల ద్వారానే శరీరానికి అందుతాయి. నిత్యం ఏదో ఒక పండే తినే వారు సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటారనేది వాస్తవం.
రక్త హీనత నివారించే పుచ్చ
పుచ్చకాయలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు, ఖనిజాలు, లవణాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లభిస్తాయి. వేసవిలో దాహం తీరుఉంది. రక్తశుద్ధి చేస్తుంది. నిద్రలేమితో బాధ పడేవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చకాయ రసంతో జ్వర పీడితులు త్వరగా కోలుకోవచ్చు. మూత్ర సంబంధ వ్యాధులకు, డీహైడ్రేషన్ సమస్యలకు పుచ్చకాయ రసమే పరిష్కారం.
నులి పురుగుల నివారణకు సీతాఫలం
సీతాఫలాలు నులిపురుగులను బయటకు నెట్టివేస్తాయి. జ్వరం తగ్గించే గుణం ఉంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త విరేచనాల నుంచి విముక్తికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్స్, విటమిన్ సీ, ఖనిజ, లవణాలు లభిస్తాయి.
టైఫాయిడ్, డిఫ్తీరియా నివారించే నిమ్మ
రోగ నిరోధక శక్తి ఇవ్వడంలో దీనికి ఇదే సాటి. టైఫాయిడ్, డిఫ్తీరియాలను కలిగించే క్రిములను నిమ్మ రసం చంపివేస్తుంది. విటమిన్ సీతో పాటు ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌లు నిమ్మలో ఉంటాయి.
గుండెకు మేలు చేసే కర్జూరం : గుండెకు మేలు చేస్తుంది. క్షయ, కడుపుబ్బరం, వాంతులు, జ్వరం, విరేచనాలు దాహం, దగ్గు, ఉబ్బసం, మూర్ఛలను నివారిస్తుంది.
రక్త సంజీవని కమలా : రోగ నిరోదక శక్తి పెంచుతుంది. తరచూ జ్వరం, జలుబు, దగ్గులతో బాధపడేవారికి కమలా దివ్యౌషధం. కమలా రసం తాగితే వెంటనే శక్తి వచ్చినట్లు ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, బికాంప్లెక్స్ ఇస్తుంది.
జీర్ణకారిణి బొప్పాయి
మాంసకృత్తుల్ని జీర్ణం చేయడంలో బొప్పాయి ప్రధానపాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో ఉండే ప్రత్యేక ఎంజైమ్ మన శరీరంలో ఉండే పెప్సిన్‌ను పోలి ఉంటుందని పరిశోధనల్లో రుజువైంది. దీనిలోని ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు శరీర అవసరాలకు సరిపోతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది.
రక్తకణాలు పెంచే ద్రాక్ష..
ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే ద్రాక్ష అజీర్ణం, మలబద్ధకం, ఆస్తమాల నుంచి దూరంగా ఉండటానికి దోహదం చేస్తుంది. రక్తకణాల వృద్ధికి ఉపకరిస్తుంది. మూత్రపిండ సమస్యల నివారిస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరిచే లక్షణం ద్రాక్షకు ఉంది. గుండెకు బలాన్నిస్తుంది.
విష జ్వరాల నివారణకు దానిమ్మ..
విష జ్వరాలను నివారించడంలో దానిమ్మ కీలకపాత్ర పోషిస్తుంది. ఎంతటి జ్వరం ఉన్నా దానిమ్మ రసం తాగితే ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. హైపర్ ఎసిడిటీ, అల్సర్లను నివారిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. జీర్ణవ్యవస్థలో వచ్చే సమస్యలు దానిమ్మ వాడకంతో తగ్గిపోతాయి.
అరటితో యవ్వనం
పేదల అల్పాహారంగా పిలవబడే అరటి పండు సంవత్సరం పొడవునా దొరికుతుంది. దీనిలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన పోషకాహారంగా తీసుకోవచ్చు. పాలతో కలిపి అరిటిపండును తింటే రోజంతా దండిగా ఉంటుంది. అల్సర్ల నివారణ, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, అజీర్ణ వ్యాఽధులు దూరం చేయడంలో దీనికిదే సాటి. నిత్య యవ్వనం సొంతం కావాలంటే అరటిపండును మించిన ఔషధం మరొకటి లేదని వైద్య గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
రోజూ ఓ ఆపిల్ తింటే...
రోజూ ఓ ఆపిల్ తింటే వైద్యుల వద్దకు వెళ్లే అవసరం ఉండదు అనే నానుడి తెల్సిందే. దీనిలో వ్యాధినిరోధక శక్తి పెంచే గుణం ఉంది. భోజనానికి ముందు తింటే ఆకలి పెరిగి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గుండె సమస్యలు, రక్తపోటు ఉన్న వారికి దీనిలోని పొటాషియం మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఐరన్, ఫాస్ఫరస్‌లు మెదడు, శరీరం చురుకుగా పనిచేసేలా చేస్తాయి. నోటి దుర్వాసన అరికట్టడంలో యాపిల్‌లో ఉండే ఆమ్లాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
పండ్లతో సంపూర్ణ పోషకాలు: వైద్య నిపుణుడు
పండ్లు సంపూర్ణ పోషకాహారాన్ని ఇస్తాయి. ప్రస్తుతం జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. పండ్లు తింటే తీవ్రత తగ్గించవచ్చు. పిల్లల ఎదుగుదలకు ఆపిల్, అరటి, జామకాయలు దోహదం చేస్తాయి. దానిమ్మ గింజలు రోజూ తినిపిస్తే జ్వరాలు రాకుండా చూడవచ్చు.
చర్మ సంబంధ వ్యాధుల నుంచి కాపాడంటంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటంతో చర్మానికి నిగారింపునిస్తుంది. శరీర కణజాలాలకు ఫాస్ఫరస్ అందేలా చూస్తాయి.
మేనికి మెరుపు: మిత్తల్‌జైన్, కాస్మెటాలజిస్ట్, లాబెలా ఇనిస్టిట్యూట్
పండ్లతో రక్త శుద్ధి అవుతుంది. దీని వలన చర్మం మెరుపు వస్తుంది. మహిళల్లో రుతుస్రావ సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. ఆరోగ్యం, అందం, శరీర ధృడత్వానికి పండ్లు తోడ్పడతాయి.
రోజుకు 300 గ్రాములు పండ్లు తీసుకోవాలి డైటీషియన్:
సీజనల్ పండ్లు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లు యాంటీబయాటిక్స్‌గా పనిచేస్తాయి. ఒబేసిటీ నివారణకు పండ్లు తినమనే సలహా ఇస్తాం. రోజుకు 300 గ్రాములు పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
No comments:
Post a Comment