పాతకాలంలో వేసవి వచ్చిందంటే చాలు ఉలవ గుగ్గిళ్లు పొయ్యిల మీద సలసల ఉడికేవి. రెండు దోసిళ్ల గుగ్గిళ్లు తిని, గ్లాసుడు నీళ్లు తాగితే.. ఆ రోజుకు అదే మంచి పౌష్టికాహారం. ఇక, మరుసటిరోజు ఉలవచారు తాగితే.. ఆహా.. ఆ సంతృప్తే వేరు. ఉలవలు ఎక్కువగా తిన్నవాళ్ల ఆరోగ్యం గుర్రంలా దౌడు తీసేది అందుకే! వాటి బలం మరే గింజలకు రాదు. ప్రస్తుతం ఉడికించిన గింజలను తినే అలవాటున్న వాళ్లు.. ఏ శనగలనో, పెసరగింజలనో తినడానికి ఇష్టపడుతున్నారు కాని.. ఉలవల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే వాటిని ఉడికించడం అంత సులభం కాదు. కాని వారానికి ఒకసారైనా మీ మెనూలో ఉలవల్ని ఎందుకు చేర్చాలో చూద్దాం. వంద గ్రాముల పిజ్జా తింటే.. అందులో పన్నెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలు ఉండవు. వంద గ్రాముల ఉలవగుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు పీచుపదార్థమూ లభిస్తుంది. అదే పిజ్జాలలో అయితే - ఇంతేసి మోతాదులో పోషకవిలువలు శూన్యం. అందుకే ఉలవల విలువను ఆయుర్వేదం ఏనాడో గుర్తించింది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్, పెప్టిక్ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుంది ఉలవ. మహిళలలో వచ్చే బహిష్టు సమస్యకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం.
ఇక, కండరాలను పటిష్టంగా ఉంచడంతోపాటు నరాలబలహీనత రానివ్వవు ఉలవలు. వీటిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పలు పద్ధతుల్లో వినియోగిస్తారు. ఉలవచారు, గుగ్గిళ్లు, కూరలు, లడ్డూలు, సూప్‌లు ఇలా ఈ మధ్య కాలంలో అందరినీ వేధించే అధిక బరువు సమస్యకు ఉలవలు భేషైన పరిష్కారం. నాణ్యమైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేగించి.. చల్లారిన తరువాత మెత్తటి పౌడర్‌లా చేయాలి. రోజూ పరకడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల మీద ఇదివరకే బోలెడన్ని పరిశోధనలు వచ్చాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉన్నట్లు తేలింది.
No comments:
Post a Comment