Friday, 17 March 2017

Remedies for Hicups

ఎక్కిళ్లు అడపా దడపా అందరినీ ఇబ్బంది పెడతాయి. ఇవి కొందరిని కొన్ని నిమిషాల పాటు విసిగించి మాయమవుతాయి. ఇంకొందరిని ఏకంగా కొన్ని గంటలపాటు వేధిస్తాయి. ఎక్కిళ్లు ఎందుకిలా ఎక్కువ సేపు అసౌకర్యానికి గురిచేస్తాయి. అసలు ఎక్కిళ్లు రావటానికి కారణలేమైనా ఉన్నాయా?
 
ఛాతీ అడుగున ఉండే డయాఫ్రమ్‌ అసంకల్పితంగా స్పందించినప్పుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్లు. ఇలా జరగటానికి చాలా కారణాలున్నాయి. 
ఆహారంతోపాటు గాలిని మింగేయటం. 
ఆహారం త్వరత్వరగా తినటం. 
ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు తినటం. 
ఎక్కువగా మద్యం తాగటం. 
భయం, ఆందోళన. 
ఉన్నట్టుండి శరీర ఉష్ణోగ్రతలో మార్పులు కలగడం. 
కొన్ని రకాల మందులు, పొట్ట భాగంలో సర్జరీలు, వ్యాధులు. 


సాధారణంగా జీవితంలో ఏదో ఓ సందర్భంలో ఎక్కిళ్లు అందరినీ వేధిస్తాయి. బాధించే సమయం నిడివిని బట్టి ఎక్కిళ్లను 3 రకాలుగా విభజించారు. 
హికప్‌ బౌట్‌: 48 గంటల పాటు ఎక్కిళ్లు వేధిస్తాయి. 
పర్సిస్టెంట్‌ హికప్స్‌: 48 గంటలు దాటి కొన్ని రోజులపాటు ఇవి కొనసాగుతాయి. 
ఇన్‌ట్రాక్టబుల్‌ హికప్స్‌: ఈ రకం ఎక్కిళ్లు నెల రోజులకు మించి బాధిస్తాయి.
 
ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి? 
ఆగకుండా నెలరోజులపాటు ఎక్కిళ్లు వేధిస్తే ఆ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి వైద్యులను ఆశ్రయించాలి. కేంద్ర నాడీ వ్యవస్థ, పక్షవాతం, మూత్రపిండాల పనితీరు మందగించటం, మానసిక వ్యాధుల్లో ఎక్కిళ్లు నెలల తరబడి వేధిస్తాయి. కాబట్టి వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
 
తేలికైన చిట్కాలు 
ఎక్కిళ్లను ఆపాలంటే మనసును ఇంకో విషయం వైపు మళ్లించాలి. కొద్ది క్షణాలు, నిమిషాలపాటు ఎక్కిళ్లు వేధిస్తూ ఉంటే ఈ చిట్కాలు ఫలితాన్నిస్తాయి. 
ముక్కును గిల్లాలి.
కొద్దిసేపు ఊపిరి బిగపట్టాలి.
నీళ్లతో నోరు పుక్కిలించాలి. 
చల్లని నీరు తాగాలి. 
నోట్లో ఒక స్పూన్‌ చక్కెర లేదా తేనె వేసుకోవాలి. 
పేపర్‌ బ్యాగ్‌లో గాలి వదిలి పీల్చాలి. 
నిమ్మకాయ కొరకాలి. 
భయానికి గురవ్వాలి.
 
ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే
 
ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు దూరంగా ఉంటే ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. అవేంటంటే.. 
కూల్‌డ్రింక్స్‌ 
మద్యం, సిగరెట్లు 
హఠాత్తుగా ఉత్తేజితమవటం, ఆందోళనకు గురవ్వటం. 
శరీర ఉష్ణోగ్రతలో మార్పులు జరగకుండా చూసుకోవటం. 
ఎక్కువ తినటం, తాగటాన్ని తగ్గించుకోవాలి. 
వేగంగా తినే అలవాటును మార్చుకోవాలి.

No comments:

Post a Comment