Thursday, 11 January 2018

Mulaga Drumsticks

బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్‌ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు.. అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు..

 అదే.. మునగాకు. ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో ఔషధాల నిధి. పోషకవిలువల గని.

మునగను ఇంగ్లిషులో మోరింగా అని అంటారు. ఇది మురుంగై అనే తమిళ పదం నుంచి వచ్చింది. తమిళనాట దీనిని విస్తారంగా సేద్యం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తమిళనాట దాదాపు లక్ష పైచిలుకు ఎకరాల్లో మునగ సాగవుతోంది. అక్కడి నుంచి మునగాకు, పొడి, విత్తనాలను అమెరికా ఎక్కువగా కొంటోంది. విదేశాలు వీటిని కాస్మెటిక్స్‌లోనూ, ఔషధాల తయారీలోనూ వాడుతున్నారని చెబుతున్నారు తమిళనాడు కు చెందిన మునగ ఎగుమతి కంపెనీ ఎస్‌వీఎం ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఎస్‌ ముత్తురాజ్‌. తమిళనాడులోనే కాదు.. ఏపీ, కర్ణాటక, ఒడిసాతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు పెరుగుతాయి. ఘనా, మొజాంబిక్‌, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్‌, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్‌లోనూ మునగ పెరుగుతున్నది.

మునగ.. పాశ్చాత్యలకు ఇది మేజికల్‌ ట్రీ. మన దగ్గర.. ‘అమ్మకు ప్రియనేస్తం’. ఎన్నో పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా.. కనీసం ఆషాఢంలోనైనా తినాలన్నారు పెద్దలు! ఒక్క ఆషాఢం అనే ఏంటి.. తరచూ తినాల్సిన ఆకు అని ఆధునిక వైద్యనిపుణులు అంటున్నారు. అల్లోపతి, ఆయుర్వేదాలు రెండింటిలోనూ మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు.
మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి.. ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి.. యాంటాసిడ్‌గా మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్లను నయం చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి మంచి మందు. కేన్సర్‌ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల నొప్పి, క్షీణతకు తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్‌ సిరోసి్‌సకు ఇది అద్భుతమైన మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 200 మిల్లీ గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ దాదాపు 40ు తగ్గుతాయి. లైంగిక సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది, తినడానికి ఘాటుగా ఉన్నా ఇది పరమౌషధం.


వంద గ్రాముల మునగాకులో
ఏమేం పోషకాలుంటాయంటే..
మాంసకృత్తులు: 8.3 గ్రాములు
కాల్షియం: 434 మిల్లీగ్రాములు
పొటాషియం: 202 మిల్లీగ్రాములు
విటమిన్‌ ఎ: 738 మిల్లీగ్రాములు
విటమిన్‌ సి: 164 మిల్లీ గ్రాములు
పీచుపదార్థాలు: 19.2 గ్రాములు

నీటి కాలుష్యం.. ప్రాణాలను హరించే పెనుముప్పు! భూగర్భజలం, ఇతర నీటి వనరులు.. దాంట్లో నీరు శుభ్రంగానే ఉండొచ్చు. కానీ, అందులో కనిపించని ఎన్నో మూలకాలు.. మలినాలు.. అనేకానేక హానికారక బ్యాక్టీరియాలు (ఈ-కొలి తదితర వర్గాలు) ఉంటాయి. అవి కేన్సర్‌కు కారకాలు కావొచ్చు.. వాటివల్ల కలరా రావొచ్చు.. లేదంటే ఎముకలు ఒంగిపోయి ఒళ్లు వంకరా అవ్వొచ్చు! అందుకే ఆ మలినాల్లేని శుద్ధమైన నీటిని తాగేందుకు.. వాడేందుకు జనాలు ‘ఫిల్టర్‌’ నీటిపై ఆధారపడుతున్నారు. పుట్టగొడుగుల్లా నీటిశుద్ధి ప్లాంట్లూ వెలసి బోలెడంత వ్యాపారమవుతోంది. డబ్బున్నోళ్లయితే ఇంట్లోనే ఎలకా్ట్రనిక్‌ నీటిశుద్ధి ఫిల్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, ఎన్ని ఆక్వాగార్డ్‌లుండనీ... ప్యూరిట్‌లు ఉండనీ.. అవన్నీ కృత్రిమమే.. తాత్కాలికమే! మరి సహజసిద్ధంగా.. చౌకగా నీటిని వడకట్టే మార్గం ఉందా అని అన్వేషిస్తే.. దొరికే సమాధానం.. పప్పుచారు.. కూరలు.. పప్పుల్లో మనం ఎంతో ఇష్టంగా తినే మునగకాయలు!
చాలాకాలంగా పటిక, ఇండెపు గింజలాంటి వాటితో నీటిని శుద్ధి చేస్తున్నా.. ఇంకా అందుబాటులో ఉండే మార్గాల కోసం శాస్త్రవేత్తలు వెదికారు.. ప్రయత్నించారు. దీనిపై అంతర్జాతీయంగా చేసిన పరిశోధనల ఫలితాల్లో మునగ ఆశ్చర్యకర ఫలితాలనిచ్చింది. నీళ్లలోని హానికారక బ్యాక్టీరియాలను మునగ గింజల పొడి నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మునగలో ఉండే మొరింగా ఓలీఫెరా కాటియోనిక్‌ ప్రొటీన్‌ (ఎంవోసీపీ).. నీటిని శుద్ధిచేస్తుంది. గింజల పొడిని నీటిలో కలిపితే.. నీటిలోని ఘనపదార్థాలతో పాటు అడుగుభాగానికి చేరిపోతుంది. తద్వారా నీటిని ఆ ప్రొటీన్‌ శుద్ధి చేస్తుంది. దాదాపు 90-99 శాతం వరకు బ్యాక్టీరియా అంతు చూస్తుంది. అయితే, నీళ్లలో మాత్రం కొన్ని మూలకాలు.. సేంద్రియ పదార్థాలుంటాయి కాబట్టి.. అది చనిపోని బ్యాక్టీరియాకు ఆహారంగా మారి మళ్లీ బ్యాక్టీరియా వృద్ధిచెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంవోసీపీని ఇసుకతో కలిపి నీటిని శుద్ధిచేస్తే.. ఆ సేంద్రియ పదార్థాన్ని సులభంగా తీసేయొచ్చంటున్నారు పరిశోధకులు. కాగా, పూర్వం ఈజిప్షియన్లూ మునగ విత్తనాల పొడిని కుండల లోపల రాసేవాళ్లు. అయితే అన్ని కాలాల్లో లభించే మునగకాయల గింజలు అందుకు అనువుగా ఉండవట. వర్షాకాలంలో కాసిన మునగకాయల్లోని గింజలైతే సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వానాకాలపు గింజలను సేకరించి, వాటిని పొడి చేసి ఏ కాలంలోనైనా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. దాని కోసం మునగసాగును భారీగా చేపడితే ఇటు రైతుకు ఆదాయంతో పాటు... నీటి శుద్ధికి సహజ మార్గం చూపినట్లవుతుందన్నది నిపుణుల మాట! మునగ గింజలే కాదు.. మునగ ఆకుకూ క్రిములను చంపే శక్తి ఉందని చెబుతున్నారు.


మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. 
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు. 
ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.
ఏముంది మునగాకులో..? 
 ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే... 
వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. 
అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి. 
అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. 
 ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే. 
నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే... 
100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌... ఇలా చాలా లభిస్తాయి. 
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

అతి తక్కువ ఖర్చుతో నీటి శుద్ధీకరణకు మునగ గింజలు దోహదపడతాయని అమెరికాలోని కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. భారత్‌లోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే మునగ చెట్ల నుంచి వచ్చే గింజల ద్వారా.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది జనాభాకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే అవకాశం ఉందని ఆ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. వీరు తయారు చేసిన ఫిల్టర్‌కు ‘ఎఫ్‌-సాండ్‌’ అని నామకరణం చేశారు. పట్టణాల్లో మునిసిపల్‌ విభాగాలు నిర్వహించే వాటర్‌ ఫిల్టర్‌ బెడ్‌లలో ‘ఎఫ్‌-సాండ్‌’ ద్వారా నీటి శుద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఫిల్టర్‌లో ఇసుక ద్వారా బురద నీరు శుద్ధి అవుతుందని.. మునగ గింజల్లో ఉండే ఎంఓ2.1 అనే ప్రొటీన్‌, కరిగే సేంద్రీయ కర్బనాలు (డీఓసీ), ఇసుకలో ఉండే సిలికాన్‌ల సమ్మిళితంతో.. బురద నీటిలో ఉండే సూక్ష్మజీవులు, కలుషితాలు పూర్తిస్థాయిలో దూరమవుతాయని వివరించారు. ఐక్య రాజ్య సమితి నివేదిక మేరకు ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల మందికి కలుషిత నీరే దిక్కని.. ‘ఎఫ్‌-సాండ్‌’తో వీరందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చని పరిశోధకులు తమ పరిశోధన పత్రాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.







No comments:

Post a Comment