Tuesday, 20 December 2016

ఆస్టియో ఆర్థరైటిస్‌

శరీరంలో కదలికలను నిర్వీర్యం చేసి, కదల్లేని పరిస్థితిలో మంచానికే పరిమితం చేయగల వ్యాధి కీళ్ల నొప్పులు. ఆస్టియో ఆర్థరైటిస్‌గా వ్యవహరించే ఈ వ్యాధి ముఖ్యంగా మోకాలి కీలు, తుంటి కీలుకు వస్తుంది. సామాన్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఏర్పడే ఈ వ్యాధి కారణంగా అడుగుతీసి అడుగు వేయలేనంత దుర్భరమైన నొప్పి వేధిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ఈ వ్యాధికి                     అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ హనుమంతరావు.
ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆయుర్వేద శాస్త్రంలో వాత ప్రధాన వ్యాధిగా పరిగణిస్తారు. దీనిని ఆయుర్వేద ఆచార్యులు సంధివాతంగా వివరించారు. సామాన్య పరిభాషలో కీళ్లు అరిగిపోయాయి అని చెప్పుకునే ఆస్టియో ఆర్థరైటిస్‌ 40 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. ఇందులో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోవడం వల్ల కీళ్ల నొప్పి వస్తుంది. 40 ఏళ్లు పైబడిన మహిళలలో ఆస్టియో ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో సరిగా నడవలేని పరిస్థితి దుర్భరంగా కనిపిస్తుంది. ఒకసారి ఆస్టియో ఆర్థరైటిస్‌ అనే సమస్య వస్తే ఇక తగ్గదనే అభిప్రాయం సరైనది కాదు.
శరీరంలో డిఫెన్స్‌ మెకానిజం ఉటుంది. దీనినే రోగ నిరోధక శక్తిగా పరిగణిస్తారు. సమస్య తీవ్రత తక్కువైతే శరీరం తనకు తాను సర్దుబాటు చేసుకుంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు మరమ్మతుకు వీలుకాదు. అప్పుడు మోకాలి కీలు, తుంటి కీలు ఉబ్బినట్లు అవుతాయి. కీలు లోపల ఒక సున్నితమైన పొర ఉంటుంది. దీనిని శ్లేషక కల అంటారు. అక్కడ శ్లేషక కఫం ఉత్పత్తయి దాని సంధికార్యం చేస్తుంది. వాత ప్రకోపం వల్ల శ్లేషక కఫం తగ్గి, శ్లేషక కల అరిగిపోవడం వల్ల ఈ సంధి వాతం వస్తుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ అంటారు.
ఆస్టియో ఆర్థరైటిస్‌ లక్షణాలు
 ఆస్టియో ఆర్థరైటిస్‌ వచ్చినప్పుడు కీళ్లు వాచి, బిగుసుకుపోయి బాధిస్తాయి. కీలు భాగాన్ని సులభంగా కదిలించలేరు. కీళ్ల దగ్గర రాపిడి ఏర్పడి శబ్దం వస్తుంది.
 వ్యాయామం చేసినప్పుడు ఆ బాధ మరింత పెరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌ పెరిగిన కొద్దీ కీళ్ల భాగాలు ఉబ్బుతాయి. ఆ వాపు వస్తూ, పోతూ ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల(ముఖ్యంగా చలికి), అలాగే శారీరక కదలికల వల్ల వేదన పెరుగుతుంది.
 ప్రారంభ దశలో బాధ, బిగుసుకుపోవడం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌కి చేరిన దశలో మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా బాధ తగ్గి స్థిరపడతాయి.
పైన వివరించిన విధంగానే మెడ భాగంలో ఉండే వెన్నుపూసలో అరుగుదల లాంటి సమస్యల వల్ల గ్రీవగత వాతం(సర్వైకల్‌ స్పాండిలోసిస్‌) వస్తుంది. దీని వల్ల చేతులలో తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. అలాగే కటి భాగంలో ఉండే వెన్ను పూసలో మార్పుల వల్ల వచ్చే కటిశ్శూల(లంబార్‌ పెయిన్‌)ను కూడా సంధివాతంగానే పరిగణించవచ్చు.
ఆయుర్వేద చికిత్సా పద్ధతులు
ఆయుర్వేద శాస్త్రంలో ఆస్టియో ఆర్థరైటిస్‌ను మూడు పద్ధతుల ద్వారా చికిత్సించవచ్చును.
నిదాన పరివర్జనం: వ్యాధికి కారణమవుతున్న వాటిని పాటించకుండా ఉండాలి. ఉదాహరణకు పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కొని ఉండటం వంటి కారణాలు వదిలిపెట్టాలి.
ఆహార నియమాలు: సరైన సమయానికి భోజనం చేయడం, తగిన వ్యాయామం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చేయాలి.
ఔషధ సేవన
శమన: దోషాలను బట్టి ఔషధ సేవన. 
శోధన: పంచకర్మ చికిత్స.
స్నేహ కర్మ, స్వేద కర్మ(పూర్వకర్మలు), వమన, విరేచన, వస్తి(ప్రధాన కర్మలు), పాశ్చాత్‌ కర్మలు తీసుకోవలసి ఉంటుంది. అభ్యంగ, శిరోధార, శిరావస్తి, గ్రీవవస్తి, కటివస్తి, జానువస్తి వంటి చికిత్సలు కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment