Tuesday, 1 May 2018

Sapota

సపోటాతో... ఎన్నో పోషకాలు

వేసవిలో లభ్యమయ్యే వాటిలో సపోటాలు ఒకటి. వేసవిలో ఉష్ణోగ్రతల ధాటికి సాధారణంగానే శరీరాన్ని నిస్సత్తువ ఆవహించడం జరుగుతుంది. ఉన్నట్టుండి బలహీనంగా అనిపిస్తుంది. దీనినుంచి బయట పడాలంటే రెండు మూడు సపోటా పండ్లు తింటే సరిపోతుందని, నిమిషాల్లో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుందట. సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోజ్‌ వల్ల ఇలా జరుగుతుంది.

ఉగాది నుంచి మే నెలాఖరు వరకూ లభించే సపోటాలను గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రాజమహేంద్రవరం దగ్గరలోని చక్రద్వారబంధం, రాధేయపాలెం, బూరుగపూడి తదితర ప్రాంతాల్లో సపోటా తోటలు ఉన్నాయి. పాల సపోటా, గేదె సపోటా, కళాపతి రకాలు పండిస్తారు. గేదె సపోటా, కళాపతి విశాఖ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. పాల సపోటా మాత్రం స్థానికంగా విక్రయిస్తారు.
సపోటాలో ఏముంటాయి..
శరీరానికి తప్పనిసరిగా అవసరమైన ఐసోలూసిన్‌, మితియోనిన్‌, ఫినైల్‌ ఆలమిన్‌, థియోనిన్‌, ట్రిప్టోఫాన్‌, వాలిన్‌, లూసిన్‌ వంటి అమినో ఆమ్లాలు, విటమిన్‌ ఏ, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌, పాంథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ బి6, ఫోలిక్‌ ఆమ్లం, సైనకోబాలమిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు, కాల్సియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, సెలీనియం వంటి ఖనిజ లవణాలతోపాటుగా శక్తి, మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, పీచు పదార్థం, సాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి.
శరీరానికి చేసే మేలు..
గుజ్జులో అధికంగా ఉండే పీచు పదార్థం, పైపొట్టులో ఉండే కేరోటిన్లు మలవిజర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. విటమిన్‌ ‘ఏ’ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ ‘సీ’ శరీరంలోని హానికరమైన ప్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. సపోటాల్లో కెరోటిన్లు, నియాసిన్‌, పిండి పదార్థాలు, రైబోఫ్లేవిన్లు, శక్తి, క్యాల్షియం, థయామిన్‌, ఫ్రక్టోస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పండ్లలో పాలిఫినోలిక్‌ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ పారాసిటిక్‌ సుగుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి హానిచేసే సూక్ష్మక్రిములను ప్రవేశించకుండా అడ్డుపడతాయి. తాజా పండ్లలో జీవ క్రియలను మెరుగుపరచే పొటాషియం, రాగి, ఇనుము, ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయిక్‌ ఆమ్లాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటాలు తినిపిస్తే మంచిదంటారు. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు మితంగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి. దీనిలో ఉండే ఏ, సీ విటమిన్లు చర్మానికి కొత్త నిగారింపును తీసుకువస్తాయి. జ్యూస్‌ కంటే పండుగా తింటేనే మేలు ఎక్కువట.
రుచిగా ఉన్నాయి కదాని అదే పనిగా తినడం సరికాదు. అలా చేస్తే అజీర్ణంతో కడుపు ఉబ్బరం చేసే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజుకు ఒక పండుకు మించి తీసుకోకూడదంట. ఒబేసిటీ, మధుమేహం ఉన్నవారు వైద్యుడి సలహా మేరకే తినాలి. సపోటాల్లో బరువు పెంచే గుణం ఉంది. పచ్చివి తింటే దానిలో ఉండే సపోనిన్‌ అనే పదార్థంవల్ల నోరు ఆర్చుకుపోయి, గొంతు, నాలిక వగరుగా అవుతాయి.
సపోటాతో పలు చిట్కాలు..
సపోటా గింజలను ముద్దలా నూరి, కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా తయారవుతాయి. చుండ్రు సమస్య కూడా నెమ్మదిస్తుంది. సపోటా పళ్లు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గుతుందని, రతి సామర్ధ్యం పెరుగుతుందని చెబుతారు.


 సపోటా  పండుగా తిన్నా జ్యూస్‌గా తీసుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది. 100 గ్రాముల సపోటా రసంలో నీరు 73.7శాతం, పొటాషియం 269 మి.గ్రా, కొవ్వు 1.1 గ్రాము, ఫాస్ఫరస్‌ 17మిగ్రా, కరోటిన్‌ 97 మైక్రోగ్రాములు, క్యాల్షియం 28 మిగ్రా, ఐరన్‌ 2 మిగ్రా, మ్యాగ్నీషియం 26మిగ్రా, సి-విటమిన్‌ 6 మిగ్రా, సోడియం 5.9 మిగ్రాముల మేరకు ఉంటాయి. సపోటా శాస్త్రీయ నామం లిక్రస్‌ సపోటా. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాల మీదుగా 18వ శతాబ్దంలో సపోటా భారతదేశానికి చేరుకుందని చరిత్రకారులు చెబుతారు. సపోటా జ్యూస్‌ను ప్రతిరోజూ నిర్ణీత ప్రమాణంలో తీసుకుంటే రక్తహీనత బాగా తగ్గుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. అతిసార వ్యాధిని నియంత్రించే గొప్ప గుణం సపోటాలో ఉంది. నరాల బలహీనతతో బాధపడేవారు సపోటా రసాన్ని తీసుకుంటే మంచిది. సపోటా రసాన్ని పాలతో కలుపకుని తాగితే శరీరానికి శక్తి లభిస్తుందని ఈ రసానికి పురుషవీర్యణాలను పెంచేశక్తి కూడా ఉందని వైద్యులు అంటున్నారు. శరీరానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి. నిత్యం ఒక సపోటాను తింటే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ప్రత్యేకించి రక్తహీనత, నరాల బలహీనతకు దివ్యౌషధంగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.



No comments:

Post a Comment