Monday 30 January 2017

Grapes and uses
















జనవరి మాసాంతంలో మొదలయ్యే గ్రేప్స్‌ సీజన్‌ వేసవి ముగిసే వరకూ కొనసాగుతుంది. మరెందుకాలస్యం ద్రాక్షను.. అందులోని పోషకాలను అందుకోండి.
ఒక కప్పు ద్రాక్ష పళ్లలో 90 కెలోరీల శక్తి ఉంటుంది. కొవ్వు శాతం సున్నా. సోడియం వెతికినా దొరకదు.
రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి ద్రాక్షలో దాదాపు 25 శాతం వరకు ఉంటుంది. విటమిన్‌ కె కూడా అధికంగానే లభిస్తుంది. 
ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఒకటిన్నర కప్పు ద్రాక్షల్లో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్‌ 24 గ్రాముల వరకు ఉంటుంది. ఫైబర్‌, ప్రొటీన్‌ 1 గ్రాము వరకు ఉంటుంది. వీటితో పాటు కాల్షియం, ఐరన్‌ అదనంగా లభిస్తాయి.
ద్రాక్షను తీసుకోవడం ద్వారా.. జీర్ణక్రియలు సాఫీగా సాగుతాయి. 
రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
కొలెసా్ట్రల్‌ కరుగుతుంది. 
గుండె, మెదడు పనితీరు మెరుగవుతుంది. 
అలసట తగ్గుతుంది. 


వే సవిలో విరివిగా లభించే ద్రాక్ష పండులో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న సంగతి తెలిసిందే! ఆ పండే ఇప్పుడు స్త్రీలలో మాతృత్వాన్ని కలిగించడానికి దోహదపడుతుందన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. మాతృత్వానికి అడ్డుగా నిలిచే సమస్యలో ఎండోమెట్రియోసిస్‌ అనేది ముఖ్యమైంది. ఈ సమస్యే ఆడవారిని మాతృత్వానికి దూరం చేసే అవకాశం ఉంది. ఈ సమస్యకు ద్రాక్షపండుతో చెక్‌ పెట్టవచ్చు అన్న విషయాన్ని పరిశోధకుగులు గుర్తించారు. కొన్ని ఎలుకలకు క్రమం తప్పకుండా ద్రాక్షపళ్లు అందించి అనంతరం వాటిలో సంతానోత్పత్తిని గమనించారు. వీటిలో మార్పును వీరు స్పష్టంగా గమనించారు. పండులోని మెలోటినిన్‌ ద్వారా వాటి పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపించిందట! స్త్రీలు వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన అండాశయంలోని కొన్ని లోపాలను సరిచేసుకోవచ్చు అని వారు చెబుతున్నారు. అయితే కేవలం ద్రాక్షపండు తినడం వలనే మాతృత్వానికి చేరువ కావచ్చా? అన్న విషయం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

Wednesday 25 January 2017

Beetroot and its benefits
















ఏ ఎత్తయిన ప్రదేశానికో, ఏ పర్వత శిఖరానికో వెళ్లినప్పుడు ఒక్కోసారి సరిపడా ఆక్సిజన్‌ అందకపోవచ్చు.  ఆ కాస్త ఆక్సిజన్‌ కొరత ఏర్పడగానే,  ఎవరికైనా  లోలోపల ఏదో భయం మొదలవుతుంది. ఊపిరి ఆగిపోతున్నట్లే అనిపిస్తుంది. పర్వతారోహకుల్లో  ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యే ఇది.  అయితే,  ఆ సమయంలో కాసింత బీట్‌రూట్‌ రసం సేవిస్తే, ఆ పరిస్థితి నుంచి చాలా వరకు  గట్టెక్కవచ్చని అంటున్నారు పరిశోధకులు. వాస్తవానికి  బీట్‌రూట్‌ రసం తనకు తానుగా  ఆక్సిజన్‌ ఏమీ ఇవ్వదు కానీ ఆ తక్కువ ఆక్సిజన్‌తోనే శరీరం సర్దుకుపోయేలా చేస్తుంది. రక్తనాళాల  పనితీరు సహజంగా నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పన్నం చేసే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అయితే పర్వత శిఖరాల్లో లేదా బాగా ఎత్తైన ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు శరీరంలో నైట్రిక్‌ ఆక్పైడ్‌ ఉత్పన్నం  కావడం ఒక సవాలుగానే ఉంటుంది. ఎందుకంటే నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పన్నం కావాలంటే దానికి  సరిపడా ఆక్సిజన్‌ ఉండాలి. అందుకు  కావలసినంత ఆక్సిజన్‌ దొరకనప్పుడు నైట్రిక్‌ ఆక్సైడ్‌ లోపాల్ని అధిగమించేందుకు మన శరీరం తనదైన దారులు  వెతుక్కుంటుంది.  అయితే, సరిగ్గా అదే సమయంలో బీట్‌రూట్‌ రసం అందుబాటులో ఉంటే ఈ సమస్యలు వాటికవే తొలగిపోతాయి. బీట్‌రూట్‌లో మౌలికంగా చాలా పెద్ద మొత్తం నైట్రేట్‌ నిలువలు ఉంటాయి. నైట్రేట్‌ను నైట్రో ఆక్సైడ్‌గా మార్చుకునే శక్తి కూడా శరీరానికి ఉంటుంది. 
సాధారణంగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు రక్తనాళాలు సంకోచిస్తాయి. సరిగ్గా అదే సమయంలో పరిశోధకులు రక్తనాళాల పనితీరును ఈ పరిణామాల్ని ఆర్టీరియల్‌ ఎండో థీలియల్‌ ఫంక్షన్‌, ఫ్లో మీడియేటెడ్‌ డైలెటేషన్‌ పరీక్షల ద్వారా అంచనా వేశారు. నార్వీగియిన్‌ సైన్స్‌ అండ్‌  టెక్నాలజీ  యూనివర్సిటీ, మిడ్‌ స్వీడన్‌ యూనివర్సిటీల అధ్యయనాల ప్రకారం  నైట్రేట్‌ అధికంగా ఉండే  బీట్‌రూట్‌ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరు బలహీనపడకుండా, అవి సమర్థవంతంగా పనిచేయడం మొదలవుతుంది.  స్త్రీ పురుషులు ఇరువురికీ,  బీట్‌రూట్‌ రసాన్ని ఇవ్వడం ద్వారా ఆరోహణకు ముందు ఆరోహణ సమయంలో రక్తనాళాల పనితీరులో వచ్చిన మార్పులను వారు గమనించారు. ప్రత్యేకించి ఆ రసాన్ని ఇచ్చాక రక్తనాళాలు వ్యాకోచం చెందడాన్ని ఒత్తిడిని అధిగమించగలగడాన్ని వారు గమనించారు. పలు రకాల మందులూ మాకులతో పనిలేకుండా కేవలం ఒక సాదాసీదా బీట్‌రూట్‌ రసంతో ఇంతటి అద్భుతాలు జరిగిపోవడం మానవజాతికి ప్రకృతి అందించిన గొప్ప వరం.!

ఆరోగ్యానికి బీట్‌రూట్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, ఊబకాయాన్ని తగ్గించేందుకు, మలబద్దకాన్ని నివారించేందుకు ఇలా ఎన్నో రకాలుగా సాయపడుతుంది. రక్తపోటును తగ్గించి గుండెకు రక్షగా ఉంటుంది. అంతేకాదు, గుండె వైఫల్యం చెందిన రోగులు తిరిగి కోలుకోవడానికీ బీట్‌రూట్‌ జ్యూస్‌లోని పోషకాలు ఉపయోగపడతాయని అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.


  • బీట్‌రూట్‌ జ్యూస్‌: దీన్లో యాంటీ కేన్సర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలుంటాయి. మూత్రం క్షారత్వాన్ని తగ్గిస్తుంది.
  • పుచ్చరసం: దీన్లో 92 శాతం నీరు ఉంటుంది. ఈ రసం తాగితే మూత్రపిండాల్లోని రాళ్లు కరిగి విసర్జించబడతాయి.




Tuesday 17 January 2017

Benefits of eating food in green plantain leaves

భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరిటాకు భోజనం సహజం. అరిటాకు భోజనం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. దీన్నొక సంప్రదాయంగా పాటిస్తారు. అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి తదితర వంటకాలు వ డ్డించుకుని భుజిస్తే ఆ రుచి వర్ణనాతీతం. అయితే అరిటాకుపైనే ఎందుకు వడ్డన? అని ప్రశ్నిస్తే అందుకు కారణాలు ఎన్నో. అవేంటో ఒకసారి చూద్దాం!
  1. పచ్చటి అరిటాకులో వేడి వేడి ఆహారపదార్థాలు వడ్డించడంవల్ల ఆకుపైన ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి మంచిరుచి వస్తుంది.
  2. ఈ ఆకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వేడి పదార్థాలు ఆ ఆకుపైన పెట్టుకుని తిన్నప్పుడు ఆకులోని విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. వేడి వేడి పదార్థాలు అరిటాకులో తినడంవల్ల కఫ, వాతాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరం కాంతిమంతమవుతుంది. ఆకలిపుడుతుంది. ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి అరిటాకులో ఉండడం విశేషం.
  3. రావి, మోదుగలాంటి ఆకులను ఎండబెట్టి విస్తర్లు తయారు చేస్తారు. కానీ భోజనానికి పచ్చి అరిటాకులనే ఉపయోగిస్తారు. అరిటాకుల్లో తినడంవల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
  4. నల్లటి కురులను మనసొంతం చేస్తుంది అరిటాకు భోజనం. క్రమంతప్పకుండా ‘అరిటాకుల్లో భోజనం’ చేస్తే బూడిదజుట్టుతో ఉన్నవారు నల్లనిజుట్టు పొందుతారు.
  5. కేరళలో కొన్ని ఇడ్లీలు, కొన్ని రకాల నానవెజ్‌ వంటలు అరిటాకుల్లోనే వండుతారు. అన్ని విటమిన్లూ అందడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పైగా ఇది పర్యావరణ హితం కూడా!
  6. ఆకలితో ఉన్నప్పుడు శత్రువుకైనాసరే అన్నంపెట్టే సంస్కృతి మనది. అలా శత్రువుకి భోజనం పెట్టినప్పుడు అన్నంలో విషం కలిపారన్న భయం ఉంటుంది. అదే అరిటాకులో భోజనం పెట్టినప్పుడు, ఒకవేళ విషాహారం పెడితే, అరిటాకు నల్లగా మారిపోతుంది. అన్నంలో విషం ఉందని బహిర్గతమైపోతుంది.
  7. అరిటాకుల్లో పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలు వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.
  8. ఏదైనా పదార్థంలో ఉప్పు ఎక్కువైతే, దాన్ని తినలేక బైటపడేయకండి. ఉప్పు ఎక్కువైన పదార్థం ఉన్న ఆ పాత్ర మూత తీసి ఆ స్థానంలో అరిటాకును పళ్లెంలాగా బోర్లించాలి. అలా కొంచెంసేపు పొయ్యిమీదపెట్టి ఆ పదార్థాన్ని వేడిచేయడంవల్ల అందులోని ఉప్పుశాతం తగ్గి రుచిగా తయారవుతుంది.
  9. అరటి ఆరోగ్య ప్రదాయిని. అరటిమొక్కలోని అన్ని భాగాలను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. పువ్వును వంటల్లో ఉపయోగిస్తారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది.

Tuesday 3 January 2017

How to control cough in natural methods

గొంతులో కఫదోష ప్రకోపంతో కలిగే ‘దగ్గు’ను ఆయుర్వేదంలో కాసరోగం అని పిలుస్తారు. ఆధునిక వైద్యులు దీనినే ‘కాఫ్‌’ అంటారు. వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్ల దగ్గు వస్తుంది. దగ్గుకు ఏ చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే దీర్ఘకాల వ్యాధిగా మారి ఊపిరితిత్తుల క్షయ వ్యాధిగా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫంతో పాటు వచ్చే దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు, కఫం, రక్తంతో పాటు కలిసి వచ్చే దగ్గు. ప్రమాదాల్లో కంఠ భాగంలో కలిగే గాయాల వల్ల కూడా రక్తంతో కలిసి కఫం వస్తుంది. దీన్ని తీవ్ర స్థితిగా గుర్తించాలి. కఫం లేని దగ్గులన్నింటికీ పాలు, నెయ్యి ఎక్కువగా వాడటం ఉత్తమ చికిత్స.
 
సులభ చికిత్సలు
  •  ఒక టీస్పూన్‌ అతి మధుర చూర్ణాన్ని ఒక టీస్పూన్‌ తేనె లేదా ఒక టీస్పూన్‌ పంచదారతో కలిపి తింటే కఫం పడిపోయి దగ్గు తగ్గుతుంది.
  •  అరగ్రాము మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర, తేనె కలిపి తింటే చాలా మంచిది.
  •  ఖర్జూరం, మిరియాలు, విడంగాలు, పిప్పళ్లు, తేనె సమభాగాలుగా కలిపి తీసుకోవాలి.
  •  పిప్పళ్లు, అల్లం, తుంగముస్తలు, పసుపు, కరక్కాయి సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేయాలి. దానికి తేనె లేదా పంచదార కలిపి పేస్టు చేసి తినాలి.
  •  ఉసిరికాయలను పాలల్లో ఉడికించి ఎండబెట్టి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిలో కలిపి తినాలి.
  •  ఒక టీ స్పూన్‌ అల్లం రసంలో సమంగా తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. కఫం కరిగిపోతుంది.
  •  25 గ్రాముల చెరకు రసంలో 25 గ్రాముల నెయ్యి కలిపి, నెయ్యి మిగిలే వరకు ఉడికించి ఆ నెయ్యిని తాగితే క్షయతో వచ్చిన కాసవ్యాధి తగ్గుతుంది.
  •  తామర గింజల చూర్ణానికి తేనె కలిపి తీసుకుంటే పైత్య దోషం వల్ల వచ్చిన దగ్గు పోతుంది.
  •  తమలపాకుల రసాన్ని వెచ్చబెట్టి చల్లారిన తర్వాత సమంగా తేనెకలిపి తాగితే గడ్డ కట్టిన కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది.
  •  ఒక టేబుల్‌ స్పూన్‌ తెల్ల తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫ ప్రకోపం వల్ల కలిగిన దగ్గు తగ్గుతుంది.
  •  మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర కలిపి ఒక టీ స్పూన్‌ చొప్పున తింటే కాస వ్యాధి తగ్గుతుంది.
  •  రెండు చిటికెల లవంగాల చూర్ణం, తేనె, పటిక బెల్లం చూర్ణంలో కలిపి తింటే దగ్గు తగ్గిపోతుంది.
  •  రెండు చిటికెల కవిరి చూర్ణాన్ని పెరుగు మీద ఉండే నీటితో కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది.
  •  ఒక తానికాయ చూర్ణాన్ని చెంచాడు తేనెతో కలిపి తిన్నా దగ్గు తగ్గుతుంది.
  •  ఒక చెంచాడు మునగ చెట్టు వేళ్ల రసానికి సమంగా నువ్వుల నూనె, తేనె కలిపి తాగిస్తే ఆశించిన ఫలితం ఉంటుంది. 

Wood Apple














గజాననం భూత గణాధిసేవితం కప్సిత జంబూఫల సారభక్షణం
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం’’ 
ఇది మహాగణపతి పూజలో గణపతి ధ్యాన శ్లోకం...
గణపతికి వెలగ (కపిత్థ), నేరేడు(జంబూ) పండ్లు ఇష్టమని దీని అర్థం. అందుకే కార్యసిద్ధికీ లక్ష్మీకటాక్షానికీ చేసేగణపతి హోమాల్లో వెలగపండు గుజ్జును వేస్తారు. వినాయక చవితినాడు కూడా గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగ తప్పని సరి.
వెలగపండులేని వినాయక చవితిని ఊహించలేం. గణపతికి ప్రీతిపాత్రమైన వెలక్కాయలు పాలవెల్లి అలంకారంగానూ నైవేద్యంగానూ పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అంతకుమించిన ఔషధ గుణాలెన్నో అందులో దాగున్నాయి. అందుకే ఈ పూజా ఫలం ... అమృత తుల్యం అంటుంటారు.
పూజా ఫలం.. అమృత తుల్యం
ఉడ్‌ యాపిల్‌, మంకీ యాపిల్‌, కర్డ్‌ ఫ్రూట్‌.. ఇలా ఇంగ్లీష్‌లో చాలా పేర్లే ఉన్నాయి. ఏనుగులు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. కాబట్టేనేమో ఎలిఫెంట్‌ యాపిల్‌ అనీ కూడా అంటారు. వినాయక చవితి మొదలుకుని వేసవి వరకూ ఇవి వస్తూనే ఉంటాయి. మిగిలిన పండ్ల మాదిరిగా కాకుండా కొబ్బరికాయలా దీన్ని కూడా పగుకొట్టి తినాల్సిందే. 
వగరు రుచి !
‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు’ అంటుంటారు. ఎందుకంటే బాగా వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినప్పటికీ దీంతో చేసే పెరుగు పచ్చడి, పప్పు కూరని రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు అయితే మంచి వాసన వస్తూ తీపీ పులుపూ కలిపిన రుచితో ఉంటుంది. దీన్ని బెల్లం లేదా తేనె అద్దుకుని తింటారు. కొబ్బరిపాలు కలుపుకుని మలయాళీలు అల్పాహారంగా తింటుంటారు. ఇండోనేషియన్లు, మిక్కిలి పండిపోతే జ్యూస్‌లూ, జామ్‌లూ చేస్తుంటారు. వేసవిలో నిమ్మకాయ షర్బత్‌లా ఈ జ్యూస్‌ దాహార్తిని తీరుస్తోంది.
పోషక భరితం..
మిగిలిన పళ్లలో మాదిరిగానే ఇందులోనూ పోషకాలకూ లోటు లేదు. 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట.
వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది.
ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. 
అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. 
మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి. 
బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కంటికీ మంచిది.
స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 
వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది. 
పండే కాదు.. ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. కానీ వేసవి వరకూ ఇవి దొరుకుతూనే ఉంటాయి. మరి ఇప్పటికైనా ఈ చెట్లను చేను గట్లమీదా, బీడుపొలాల్లోనూ వేద్దాం.. మెలగపండ్ల రుచుల్నీ ఆస్వాదిద్ధాం!