గొంతులో కఫదోష ప్రకోపంతో కలిగే ‘దగ్గు’ను ఆయుర్వేదంలో కాసరోగం అని పిలుస్తారు. ఆధునిక వైద్యులు దీనినే ‘కాఫ్’ అంటారు. వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్ల దగ్గు వస్తుంది. దగ్గుకు ఏ చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే దీర్ఘకాల వ్యాధిగా మారి ఊపిరితిత్తుల క్షయ వ్యాధిగా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫంతో పాటు వచ్చే దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు, కఫం, రక్తంతో పాటు కలిసి వచ్చే దగ్గు. ప్రమాదాల్లో కంఠ భాగంలో కలిగే గాయాల వల్ల కూడా రక్తంతో కలిసి కఫం వస్తుంది. దీన్ని తీవ్ర స్థితిగా గుర్తించాలి. కఫం లేని దగ్గులన్నింటికీ పాలు, నెయ్యి ఎక్కువగా వాడటం ఉత్తమ చికిత్స.
సులభ చికిత్సలు
- ఒక టీస్పూన్ అతి మధుర చూర్ణాన్ని ఒక టీస్పూన్ తేనె లేదా ఒక టీస్పూన్ పంచదారతో కలిపి తింటే కఫం పడిపోయి దగ్గు తగ్గుతుంది.
- అరగ్రాము మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర, తేనె కలిపి తింటే చాలా మంచిది.
- ఖర్జూరం, మిరియాలు, విడంగాలు, పిప్పళ్లు, తేనె సమభాగాలుగా కలిపి తీసుకోవాలి.
- పిప్పళ్లు, అల్లం, తుంగముస్తలు, పసుపు, కరక్కాయి సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేయాలి. దానికి తేనె లేదా పంచదార కలిపి పేస్టు చేసి తినాలి.
- ఉసిరికాయలను పాలల్లో ఉడికించి ఎండబెట్టి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిలో కలిపి తినాలి.
- ఒక టీ స్పూన్ అల్లం రసంలో సమంగా తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. కఫం కరిగిపోతుంది.
- 25 గ్రాముల చెరకు రసంలో 25 గ్రాముల నెయ్యి కలిపి, నెయ్యి మిగిలే వరకు ఉడికించి ఆ నెయ్యిని తాగితే క్షయతో వచ్చిన కాసవ్యాధి తగ్గుతుంది.
- తామర గింజల చూర్ణానికి తేనె కలిపి తీసుకుంటే పైత్య దోషం వల్ల వచ్చిన దగ్గు పోతుంది.
- తమలపాకుల రసాన్ని వెచ్చబెట్టి చల్లారిన తర్వాత సమంగా తేనెకలిపి తాగితే గడ్డ కట్టిన కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది.
- ఒక టేబుల్ స్పూన్ తెల్ల తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫ ప్రకోపం వల్ల కలిగిన దగ్గు తగ్గుతుంది.
- మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర కలిపి ఒక టీ స్పూన్ చొప్పున తింటే కాస వ్యాధి తగ్గుతుంది.
- రెండు చిటికెల లవంగాల చూర్ణం, తేనె, పటిక బెల్లం చూర్ణంలో కలిపి తింటే దగ్గు తగ్గిపోతుంది.
- రెండు చిటికెల కవిరి చూర్ణాన్ని పెరుగు మీద ఉండే నీటితో కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది.
- ఒక తానికాయ చూర్ణాన్ని చెంచాడు తేనెతో కలిపి తిన్నా దగ్గు తగ్గుతుంది.
- ఒక చెంచాడు మునగ చెట్టు వేళ్ల రసానికి సమంగా నువ్వుల నూనె, తేనె కలిపి తాగిస్తే ఆశించిన ఫలితం ఉంటుంది.
No comments:
Post a Comment