Thursday 26 July 2018

Turmeric has antibiotic properties




























దెబ్బ తగిలి రక్తం కారేటప్పుడు ప్రప్రధమంగా గుర్తుకొచ్చే ఔషధం పసుపే. ఆడుకునేటప్పుడు గాయమైతే ఎవరూ చెప్పకుండానే పరుగుపరుగున వంట గదిలోంచి గుప్పెడు పసుపు తెచ్చి దెబ్బ తగిలినచోట రాయడం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటనే. పసుపులో అనేక ఔషధ గుణాలతోపాటు, గాయం అయినప్పుడు సెప్టిక్‌ కాకుండే చూసే లక్షణాలు కూడా ఉన్నాయి. వంట చేసేటప్పుడు ఆ పదార్ధాల్లో చిటికెడు పసుపు వేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని పెద్దలు ఏనాడో చెప్పారు. జలుబు చేసినప్పుడు, శరీర ఉష్ణోగ్రత పడిపోతున్నప్పుడు కూడా పసుపు చేసే మేలు ఇంతా అంతా కాదు. సంప్రదాయం పేరిట మహిళలు పాదాలకు ప్రతి శుక్రవారం పసుపు రాసుకోవడం సహజం.  పాదాలు పగుల కుండా, తేమవల్ల దెబ్బతినకుండా చూడటంలో పసుపులో ఉండే కుర్కుమిన్‌ కీలకంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజూ కుర్కుమిన్‌ శరీరానికి కనీసం 3 గ్రాములు అందాలి .

పసుపులో ఉండే కుర్కుమిన్‌ అమృతతుల్యమైనది.
వచ్చిన రోగాన్ని తగ్గించుకోవడం కంటే అసలు రోగం రాకుండా నివారించడమే మేలని విజ్ఞులు చెబుతారు. పసుపు అందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి నీరు, పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పానీయాల్లోనే కాదు వంటపదార్థాల్లో కూడా పసుపు వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పసుపులో ఉండే కుర్కుమిన్‌ అనే పదార్థం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు. 

వేడిపాలల్లో చిటికెడు పసుపు కలిపి తీసుకోవడం మంచిదే. అయితే కొబ్బరి పాలల్లో పసుపు కలిపి తాగితే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు పాలల్లో కొద్దిగా పసుపు, దాల్చినచెక్క పొడి వేసుకుని తాగితే త్వరగా ఉపశమనం చేకూరుతుందని నూట్రిషనిస్ట్‌ రాధిక సూచిస్తున్నారు. అన్ని కాలాల్లో ఇటువంటి పానీయం తాగవచ్చని, అయితే శీతాకాలంలో ఈ పానీయం వల్ల మరింత మేలు కలుగుతుందని సెలబ్రెటీలకు డైటీషియన్‌గా కూడా వ్యవహరిస్తున్న రాధిక చెబుతున్నారు. ఉదయాన్నే పసుపు, దాల్చినచెక్క పొడి చేర్చిన వేడి పాలు తాగితే రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

 పసుపు, లవంగాల పొడి వేసుకుని పాలు తాగితే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఈ టానిక్‌ వల్ల డెంగ్యూ వ్యాధి రాకుండా నివారించవచ్చు. డెంగ్యూ సోకిన వారికి ఈ పసుపు పానీయం ఇచ్చినట్లయితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు నొప్పి వల్ల కలిగే మంటనుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పసుసులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో సహజంగా ఉండే కుర్కుమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుతుంది. అందువల్ల దేహంలోకి ప్రవేశించే రోగకారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. శరీరానికి ఎటుంటి బాధ కలగకుండానే రోగకారక బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించి ప్రాణాలను హరించేలా చేస్తుంది. అటువంటి చెడు బ్యాక్టీరియాను కుర్కుమిన్‌ నిలువరిస్తుంది. 
 

శరీరంలోని కణాలను దెబ్బతీసే చర్యల కారణంగానే అనేక రోగాలు వస్తున్నాయి. ఇందులో ఫ్రీ రాడికల్స్‌ పాత్ర కీలకం. కణాల్లో భాగమైన మొలెక్యూల్స్‌ను ఎలక్ట్రాన్లతో జతచేర్చడానికి ఫ్రీ రాడికల్స్‌ దోహదం చేస్తాయి. దీంతో ప్రొటీన్లు, డీఎన్‌ఏపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కుర్కుమిన్‌లోని యాంటీ యాక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్‌ నుంచి దేహాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను కుర్కుమిన్‌లోని రసాయనక వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. అంతేకాదు యాంటి యాక్సిడెంట్‌ ఎంజైమ్‌లను దేహం సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా కుర్కుమిన్‌ సహాయపడుతుంది. అంటే శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యపరచడంతో పాటు దేహం తనకు తానుగా యాంటీ యాక్సిడెంట్లను ఉత్పత్తి చేసుకునేందుకు కూడా పసుపులోకి కుర్కుమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. 

మెదడు పనితీరును పసుపు మెరుగుపరుస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కుర్కుమిన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మెదడులో ఉండే న్యూరాన్ల సంఖ్య పెరుగుదల విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మెదడులో న్యూరాల్లు కొత్త సంబంధాలను కలుపుకోవడంలోను, కొన్ని ప్రాంతాల్లో తమ సంఖ్యను బహుముఖంగా అభివృద్ధి చేసుకోవడంలో హార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మెదడు ఉత్పాదక  న్యూరోట్రోఫిక్‌ మూలకమనే ఈ హార్మోన్‌ అభివృద్ధి చెందడం వల్లే మెదడు పనితీరు మెరుగుదలకు కారణమవుతోంది. ఈ హార్మోన్‌  స్థాయిలు తగ్గిపోతే మెదడుకు సంబంధించిన అనేక రుగ్మతలు ఏర్పడతాయి. కుంగుబాటు, అల్జిమర్స్‌ వంటి వ్యాధులు ఈ హార్మోన్‌ లోపిస్తేనే కలుగుతాయి. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ హార్మోన్‌ను పెంపొందింపచేయడంలో కుర్కుమిన్‌ కీలకంగా వ్యవహరించడం. పసుపును ఆహారంలో, పానీయాల్లో తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు అల్జిమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వయసు మీద పడటం వల్ల వచ్చే మెదడు సంబంధిత వ్యాధులను కుర్ముమిన్‌ నివారిస్తుందని  పరిశోధనల్లో తేలింది. 
 
 గుండె జబ్బులకు కారణాలు అనేకం ఉన్నా వాటి నివారణలో కుర్కుమిన్‌ కీలకమని పరిశోధనల్లో తేలడం గమనార్హం.  రక్తనాళాల్లో లోపలి పొర ఎండోథిలియం పనితీరును కుర్కుమిన్‌ మెరుగుపడుతుంది. రక్తం సరఫరాను నియంత్రించే ఎండోథిలియం సరిగా పనిచేయకపోతే నాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇటీవల ఒక ఆస్పత్రిలో కరోనరీ బైపాస్‌ సర్జరీ చేయించుకోవలసిన 121 మందిపై కుర్కుమిన్‌ చూపే ప్రభావం గురించి పరిశోధనలు చేశారు.  కొందరికి రోజుకు 4 గ్రాముల కుర్కుమిన్‌ ఇచ్చారు. సర్జరీకి ముందు ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కుర్ముమిన్‌ తీసుకున్న వారిలో 65 శాతం మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గిపోయినట్లు ఇటీవలి పరిశోధనలు తెలియజేశాయి.
 

 
రోగకారక కణాలు విచ్చలవిడిగా పెరిగిపోయే లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్‌ ప్రధానమైనది. క్యాన్సర్‌లో వివిధ రకాలు ఉన్నా, ప్రాథమికంగా అనేక పోలికలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని కుర్కుమిన్‌ సప్లిమెంట్లకు స్పందించేవి కూడా ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధికి చికిత్సలో కుర్కుమిన్‌ ఆధారిత ఔషధం వలన ఉపయోగం ఉంటుందని, వ్యాధి విస్తృతిని అరికట్టే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది. క్యాన్సర్‌ కారక కణాలను నాశనం చేయడంతో పాటు యాంజియోజెనెసిస్‌ (క్యాన్సర్‌ కణంలో కొత్త నాళాలు వృద్ధిచెందే ప్రక్రియ) ముప్పును తగ్గిస్తుందని వెల్లడైంది. ఈ విషయం ప్రయోగశాలల్లో జంతువుల్లో జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా, మానవుల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం అధిక డోసులో కుర్కుమిన్‌ ఇవ్వడం వలన ప్రయోజనం ఉంటుందా అనే విషయమై పూర్తి స్థాయిలో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ప్రాథమిక దశలో ప్రత్యేకంగా జీర్ణవ్యవస్థకు సంబంధించి పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా నివారిస్తుందని తేలింది. పెద్ద పేగుకు గాయమైప్పుడు ఒక్కోసారి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇటీవల పెద్దపేగుకు గాయమైన 44 మందిపై 30 రోజుల పాటు జరిపిన పరిశోధనల్లో కుర్కుమిన్‌ చేసే మేలు గురించి వెల్లడైంది. అలా గాయపడ్డవారికి రోజుకు నాలుగు గ్రాముల కుర్కుమిన్‌ అందేలా చేశారు. దీంతో పెద్ద పేగులో గాయాలు 40 శాతం నయమయ్యాయి. దీనిని బట్టీ చూస్తే క్యాన్సర్‌కు సంప్రదాయ  చికిత్సలో కుర్కుమిన్‌ను ఔషధంగా వినియోగించే రోజు ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది.

ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన కీళ్ళ నొప్పులు (ఆర్థరైటిస్‌) ఇప్పుడు దాదాపు అన్ని దేశాల ప్రజలను వేధిస్తున్నాయి. కీళ్ళ నొప్పుల్లో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మోకాలి జాయింట్లలో నొప్పితో బాధపడేవారే ఎక్కువ. కుర్కుమిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్‌ ఆ బాధను నివారిస్తుంది. ఈ విషయం నిజమని అనేక అధ్యయనాల్లో రుజువైంది కూడా. రూమటాయిడ్‌ ఆథ్రిటిక్‌తో బాధపడేవారిపై జరిపిన అధ్యయనంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ కన్నా కుర్కుమిన్‌ అధిక ప్రభావం చూపినట్లు వెల్లడైంది. దేహంలో వివిధ భాగాల్లో వచ్చే కీళ్ళనొప్పులను నివారించడంలో కుర్కుమిన్‌ మెరుగైన ప్రభావం చూపుతుందని అనే పరిశోధనులు చెబుతున్నాయి.

 
వివిధ కారణాల వల్ల కుంగుబాటుకు (డిప్రెషన్‌) గురైనవారికి చికిత్సలో కుర్కుమిన్ ఆశాజనకమైన ప్రభావం చూపినట్లు  ఒక అధ్యయనంలో వెల్లడైంది. డిప్రెషన్‌లో ఉన్న 60 మందిని మూడు బృందాలుగా విభజించారు. ఒక బృందంలోని రోగులకు ప్రొజాక్‌ మాత్రలను, రెండో బృందంవారికి ఒక గ్రాము కుర్కుమిన్‌, మూడో బృందం వారికి ప్రొజాక్‌ మాత్రలతో పాటు కుర్కుమిన్‌ను కూడా ఇచ్చారు. ఆరు వారాల తర్వాత ప్రొజాక్‌ మాత్రలు వేసుకున్న రోగుల్లో కనిపించిన ఫలితమే కుర్కుమిన్‌ తీసుకున్నవారిలోనూ కనపడింది. అయితే ఈ రెండూ తీసుకున్న మూడో బృందంలోని రోగుల్లో మరింత మెరుగైన ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. మెదడులో హిప్పోకాంపస్‌ అనే ప్రాంతం కుచించుకుపోవడం కుంగుబాటుకు దారితీస్తుంది. డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కుర్కుమిన్‌ ఎంతో మేలు చేస్తుందని రుజువైంది. సెరొటోనిన్‌ అనే న్యూరో ట్రాన్సిమిటర్లను ఉత్తేజపరిచడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడైంది. అందువల్ల తినే పదార్థాలు, తాగే పానీయాల్లో పసుపు తప్పనిసరిగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
 








No comments:

Post a Comment