రోజూ ఒకటి తింటే ఓకే.. అంతకు మించితే ఇబ్బందే
బరువు పెంచడమే కాదు.. తుంచడటంలోనూ మామిడి సహాయపడుతుందంటున్న డైటీషియన్లు
కేలరీలు కౌంట్ చేసుకుని మరీ ఫుడ్ తీసుకుంటున్న కాలంలో మామిడి తీసుకుంటే వెయిట్ పెరుగుతామా అని సందేహపడుతూ పౌష్టికాహారానికి దూరంగా ఉంటున్న వారెందరో ! ఇక చక్కెర వ్యాధిగ్రస్తుల సంగతి సరే సరి. ఇదే విషయమై ఆల్టర్‌నేటివ్ మెడిసన్, హోలిస్టిక్ న్యూట్రిషియనిస్ట్ ల్యుక్ కౌటిన్హో మాట్లాడుతూ ‘‘వేసవిలో చాలామంది మామిడి తినాలా వద్దా అని సందేహ పడుతుంటారు. అందునా మధుమేహ రోగులు తమ కోర్కెలను అణుచుకుని మరీ ఈ ఫ్రూట్‌కు దూరంగా ఉంటుంటారు. నన్నడిగితే అలా దూరంగా ఉండాల్సిన అవసరం లేనే లేదు. ప్రకృతి సిద్ధ ఉత్పత్తి అయిన ఏ పండు కూడా ఆరోగ్యానికి హాని చేయదు. కానీ ప్యాకేజ్డ్ లేదంటే ప్రాసెస్డ్, అనారోగ్యకరమైన జీవనశైలి గురించి మాత్రం భయపడాల్సిందే ! అని అన్నారు.
పోషకాలు ఘనం.. అదే మనకు ఇంధనం..
శరీరానికి అవసరమైన పోషకాలు మామిడిలో చాలా ఎక్కువ. ఓ మీడియం సైజ్ మామిడి దాదాపు 200 గ్రాముల బరువు ఉంటే అది 150 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. అధికంగా విటమిన్ సీ,ఏ , కేలను అందించడంతో పాటుగా విటమిన్ బీ12 మినహా బీ కాంప్లెక్స్ విటమిన్‌లను, కొంత పరిమాణంలో ఒమేగా 3, ఒమేగా 6, మినరల్స్,ఫైబర్ కూడా మామిడిలో లభిస్తాయి. కార్బోహైడ్రేట్స్ 28 గ్రాములు ఉంటే సోడియం 3 గ్రాములు, షుగర్ 24 గ్రాములు లభిస్తాయి. అంతేనా మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సైతం దీనిలో ఉన్నా కొలెస్ట్రాల్ కంటెంట్ మాత్రం ఉండదు. దీన్లో గ్లిసామిక్ కంటెంట్ వల్ల మామిడి తింటే లావైపోతామని భయపడాల్సిన అవసరం లేదని న్యూట్రిషియని్‌స్టలు చెబుతున్నారు. అయితే అధికంగా మామిడి తింటే, అందునా డయాబెటీస్ ఉండి వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం ఇబ్బంది అని చెబుతున్నారు. మధుమేహం ఉన్నా మామిడి తినొచ్చని ల్యూక్ చెబుతూ మధుమేహం అనేది ఓ వ్యాధి కాదు. ఓ స్థితి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు ఓ మామిడి తినే బదులు దాన్లో సగం తింటే సరిపోతుంది. నిజానికి మామిడిలోని ఫైబర్ రక్తంలోని చక్కెర నిల్వలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటాయి కానీ దీనితో పాటుగా కొన్ని నట్స్, సీడ్స్ తీసుకుంటే మంచిది. నిజానికి మామిడిలో మాంగిఫెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లేమ్మేటరీగా పనిచేసి శరీరంలోని కొన్ని ఎంజైమ్స్‌పై ప్రభావం చూపుతాయి. నిజానికి ఇవి మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అన్నారు. ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించింది. సీజన్స్‌కు అనుగుణంగా లభించే పళ్లను ఆరగించడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికారక వ్యర్థాలెన్నింటినో బయటకు పంపొచ్చు. ఓ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో షుగర్ స్థాయి పెరిగినంత మాత్రాన దాన్ని బ్యాడ్ అని ముద్ర వేయడం సరికాదనే చెబుతున్నారు న్యూట్రిషియని్‌స్టలు. ఇదే విషయమై న్యూట్రిషియనిస్ట్ స్వాతి మాట్లాడుతూ ‘ కొంతమంది మామిడి తింటే వేడి అని.. సెగ్గడ్డ లేదంటే మొటిమలు వస్తాయని అంటుంటారు. అందులో వాస్తవం కూడా ఉంది. కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా తెలుసుకోవాల్సిందే ! శరీరంలోని మలినాలను బయటకు పంపే క్రమంలో వచ్చే రెస్పాన్స్‌గానే చూడాలి తప్ప రియాక్షన్‌గా కాదు..అని అన్నారు.
మామిడితో బరువు పెం(తుం)చుకోనూ వచ్చు..!
కేలరీలను కౌంట్ చేసుకుని మరీ ఆహారం తీసుకుంటున్న రోజులివి. 10 కేలరీలు ఎక్కువైనా 10 రోజులు బాధపడే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కూడా కనిపిస్తుంటారు. ఈ మామిడి పళ్ల సీజన్ వీరికి చాలా ఇబ్బంది కరమైన కాలం కిందే చెప్పాల్సి ఉంటుంది. అటు తినకుండా ఉండలేరు. తిన్న తర్వాత బాధపడకుండానూ ఉండలేరు. నిజానికి మామిడి రెండు రకాల ప్రయోజనాలను ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కు అందిస్తుంది. మరీ ముఖ్యంగా వెయిట్‌మేనేజ్‌మెంట్‌లో ప్రధాన సూత్రమైన కేలరీస్ ఇన్.. కేలరీస్ ఔట్‌కు అనుగుణంగా..! ఒక మామిడి తింటే శరీరానికి 150 కిలోకేలరీల శక్తి వస్తుందనుకుంటే ఆ మేరకు మిగిలిన ఫుడ్ కట్ చేసుకోవాల్సి ఉంటుందనేది న్యూట్రిషియని్‌స్టల మాట. మన నగరంలో అనేకాదు చాలా చోట్ల భోజనమైన తర్వాత మామిడి తీసుకుంటుంటారు. దీనివల్ల అప్పటికే ఓవర్‌గా తీసుకున్న ఫుడ్ కేలరీలకు తోడు ఇది కూడా తోడవడం వల్ల శరీరంలో కొవ్వు కంటెంట్ పెరుగుతుంది. దానివల్లనే లావు అయ్యామని చాలా మంది భావిస్తుంటారని డైటీషియన్ స్వాతి తెలిపారు. మరి మామడితో వెయిట్ ఏ విధంగా తగ్గుతారనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. నిజానికి మామిడి తిన్నప్పుడు తొక్క అందరూ పారేస్తారు. కానీ ఆ తొక్కలోనే బరువు తగ్గడానికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయని తేల్చారు. డైటీషియన్లు ఈ ఫలితాల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నా.. మామిడి వల్ల బరువు తగ్గుతుందా అంటే తగ్గుతుంది అని చెప్పొచ్చు.
మామిడి.. ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ఱశక్తికి తోడ్పడుతుంది: మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా నీటి శాతం కూడా ఎక్కువ. అందువల్ల మలబద్ధకాన్ని ఇది నివారించడంతో పాటుగా జీర్ణశక్తిని కూడా నియంత్రించి, ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: మామిడిలో ఫైబర్, విటమిన్ సీ అధికంగా ఉంటాయి. ఇది సెరల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్‌డీఎల్) తగ్గిస్తుంది. దీనినే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు.
ఆస్తమా తగ్గిస్తుంది..: అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్, బెటా కెరోటిన్ అధికంగా తీసుకునే వారిలో ఆస్తమా వృద్ధి చెందే అవకాశాలు తక్కువ అని తేలింది. మామిడిలో బేటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.
ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఓ మీడియం సైజ్ మామిడిలో 15 మిల్లీగ్రాముల విటమిన్ కె. ఉంటుంది. శరీరం కాల్షియం స్వీకరించడాన్ని ఇది వృద్ధి చేయడంతో పాటుగా ఎముకల ఆరోగ్యం కూడా పెంచుతుంది.
కంటి ఆరోగ్యానికీ మంచిది: ఓ కప్పుడు మామిడి ముక్కలు రోజూ శరీరానికి కావాల్సిన విటమిన్ ఏలో 25 శాతం అందిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడంతో పాటుగా కళ్లు పొడిబారడాన్ని కూడా మామిడి తగ్గిస్తుంది.
రోగ నిరోధక శక్తి వృద్ధి చేస్తుంది: విటమిన్ సీ, ఏ అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
క్యాన్సర్లు, గుండె పోటు నివారిస్తుంది: మామిడిలో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.100 గ్రాములు మామిడిలో 168 మిల్లీగ్రాముల పొటాషియం, 1 మిల్లీ గ్రామ్ సోడియం ఉంటాయి. ఇక హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం మామిడిలో బెటా కెరోటిన్‌తో పాటుగా క్యురెసెటిన్, ఐసోక్యురెసెటిన్, అస్ట్రాగాలిన్ లాంటి పదార్థాలున్నాయని ప్రొస్టేట్, కొలన్, బ్రెస్ట్ క్యాన్సర్స్‌తో పాటుగా లుకేమియా రాకుం డా అడ్డుకోవడంలో ఇవి కొంతమేరకు తోడ్పడతాయని తెలిపింది.
మామిడి తిన్నా నా బ్లడ్ షుగర్ కంట్రోల్‌నే ఉంది..
నాకు పీసీఓఎస్ సమస్య ఉం ది. మధుమేహం, బరువు సంబంధిత సమస్యలకు ఇది ఓ కారణమవుతుందని తెలిసిందే ! అందువల్ల ఏం తినాలి, ఏం తినకూడదనే విషయమై చాలా పర్టిక్యులర్‌గా ఉం టాను. అయినప్పటికీ వేసవి వచ్చిందంటే చాలు.. మామిడి పళ్లను తినకుండా ఉండలేను. రోజూ కనీసం 1-2 మామిడి పళ్లు తింటాను. అయినప్పటికీ నేను సంతోషంగా, గర్వంగా చెబ్తున్నాను... నా బ్లడ్ షుగర్ లెవల్స్ పూర్తి నియంత్రణలో ఉన్నాయని. అలాగే నా బరువు కూడా నియంత్రణలోనే ఉంది. న్యూట్రిషియని్‌స్టగా ఏం తినాలి, ఎలా తినాలనేది నాకు తెలుసు. నా మీల్స్‌తో పాటుగా చేసే వ్యాయామాలు కూడా బ్యా లెన్స్ చేసుకుంటూ ఉంటా ను. న్యూట్రిషియని్‌స్టగా మాత్ర మే కాదు ఓ పేషంట్‌గా నేను చెప్పేది మామిడి పళ్లను తినండి.. కానీ ఏ విధంగా మీ డైట్‌తో బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకుని తినండి. దానితో పాటు మామిడి పళ్లు తిని కూర్చోకుండా శారీరక శ్రమకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఆ పళ్ల మజాను మరింతగా ఆస్వాదించగలం.
మామిడిలో విటమినులూ, ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మామిడి కాయల్లోని పాలీఫినాల్స్ లక్షణాలు పలురకాల కాన్సర్లను నిరోధిస్తాయి. ఊబకాయుల్లో చక్కెర స్థాయిలను మామిడి అదుపుచేస్తుందని పరిశోధనల్లో తేలింది. మామిడిలో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది రక్త హీనతను నివారించేందుకు దోహదపడుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవారికి మామిడి మంచి మందులా పనిచేస్తుంది. డయేరియా, ఎండదెబ్బ, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి సమస్యలు, మొలలు, ఇలాంటి అన్ని సమస్యలకూ మామిడిపండు మంచి టానిక్‌గా ఉపకరిస్తుంది. మానసికంగా బలహీనులైనవారికి దీని రసం ఉత్తేజాన్నిస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుంది.